|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 06:26 PM
తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను వేగంగా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందించే కీలక పథకాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది ప్రభుత్వ ప్రధాన హామీలలో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగంగా రాబోయే ఉప పథకం. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు గణనీయమైన ఆర్థిక భరోసాను కల్పించడంతో పాటు.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అదనపు బలాన్ని చేకూర్చనుంది.
మహాలక్ష్మి పథకం విస్తరణ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ఆరు గ్యారెంటీలను అమలు చేయడం ప్రారంభించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం ( 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్) వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభమై.. పలువురు లబ్ధిదారులకు మొదటి విడత నిధులు కూాడా అందాయి. ఇప్పుడు మహిళలకు ఆర్థిక సాయం కింద నెలకు రూ.2,500 అందించే పథకం అమలుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు సంవత్సరానికి రూ.30,000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
ఈ పథకానికి సంబంధించిన విధివిధానాలను అధికారులు ముమ్మరంగా రూపొందిస్తున్నారు. 55 ఏళ్ల లోపు మహిళలను ప్రధాన లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని, ప్రభుత్వ పింఛను (వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛను వంటివి) పొందని కుటుంబాల్లోని మహిళలకే ఈ సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ప్రభుత్వ హామీల అమలులో పారదర్శకతను, సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని స్పష్టం చేస్తుంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి త్వరలోనే మహిళలకు ఈ తీపి కబురు తెలియజేస్తారని పేర్కొన్నారు.. ఇది మహిళల్లో ఈ పథకంపై ఆశలను పెంచింది.
స్థానిక ఎన్నికల వ్యూహం..
మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం పథకం అమలు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరగడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉంది. జూలై నెలాఖరున సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతుందని.. ఈ అంశంపై క్యాబినెట్‌లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈలోపే మహిళలకు ఆర్థిక భరోసా కింద డబ్బులను జమ చేయడం ద్వారా, ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందని ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రైతులకు రైతు భరోసా నిధులు జమ చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని, వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా నిధులు ఈ నెలాఖరులోగా జమ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఈ రెండు ముఖ్యమైన పథకాలను స్థానిక ఎన్నికలకు ముందే అమలు చేయడం ద్వారా.. కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని, ప్రజల్లో తమపై విశ్వాసాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల హామీలను నెరవేర్చడం ద్వారా ప్రజల మద్దతును కూడగట్టుకుని, గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు తమ ప్రభావాన్ని విస్తరించాలని కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది.