|
|
by Suryaa Desk | Mon, May 19, 2025, 04:28 PM
ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ దేశవ్యాప్తంగా జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ గతంలో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసిన ఘనతను గుర్తు చేశారు. 50 ఏళ్లు గడిచినా ఇందిరాగాంధీ పేరును ప్రజలు తలుచుకుంటున్నారంటే ఆమె పాలన ఎంత గొప్పదో అర్థమవుతుందన్నారు. ప్రతి ఆదివాసీ గుండెల్లో ఇందిరమ్మ చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు.నల్లమల ప్రాంత సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పోడు భూములను వ్యవసాయానికి అనుకూలంగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇదే వేదికపై 'నల్లమల డిక్లరేషన్'ను కూడా ఆయన ఆవిష్కరించారు.అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి, నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించారు. ఒకప్పుడు వెనుకబాటుకు నిలయంగా ఉన్న నల్లమల ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడటం గర్వకారణంగా ఉందని, తన గుండె ఉప్పొంగిపోతోందని ఆయన అన్నారు. తాను పాలమూరు, నల్లమల ప్రాంత వాసినని సగర్వంగా చెప్పుకుంటానని, కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు.