|
|
by Suryaa Desk | Sat, Aug 30, 2025, 10:58 PM
నందమూరి బాలకృష్ణ మరోసారి తన ఉదారతను చూపించారు. ఇటీవల తెలంగాణలో కురిసిన వర్షాలు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా కామారెడ్డిలో భారీ నష్టం సంభవించింది.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టాలీవుడ్ నుంచి పలువురు ముందుకొచ్చి సహాయం ప్రకటిస్తున్నారు. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా తమ వంతు సాయం అందించనున్నారు. వరదల కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న ప్రజల కోసం తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు.హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు స్వీకరించిన అనంతరం బాలయ్య ఈ విషయాన్ని వెల్లడించారు. రైతులకు ఈ సాయం ఉపయోగపడాలని కోరుతూ, “వారి కన్నీళ్లను ఎవరూ పూర్తిగా తుడవలేరు. కానీ నా వంతుగా ఈ సహాయం అందిస్తున్నాను” అని భావోద్వేగంగా అన్నారు.ఈ విపత్తు వల్ల కామారెడ్డి, మెదక్ జిల్లాలు ఎన్నడూ చూడని విధంగా నష్టపోయాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. రైతులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి బాధపడ్డానని, ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Latest News