|
|
by Suryaa Desk | Tue, Sep 30, 2025, 05:46 PM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'ఓజీ' విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా అభిమానులకు అసలైన పండగ అని, పవన్‌ను తెరపై చూసి తాను ఎంతో గర్వపడ్డానని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి 'ఓజీ' చిత్ర బృందంతో కలిసి ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించిన చిరంజీవి, అనంతరం సోషల్ మీడియా ద్వారా తన పూర్తి అభిప్రాయాన్ని పంచుకున్నారు. "నా కుటుంబంతో కలిసి 'ఓజీ' చూశాను. సినిమాలోని ప్రతి అంశాన్ని పూర్తిగా ఆస్వాదించాను. ఇది హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది" అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ కథ అయినప్పటికీ, ఇందులో భావోద్వేగాలకు ఎలాంటి లోటు లేదని ఆయన తెలిపారు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు సుజిత్ అద్భుతంగా తీర్చిదిద్దాడని కొనియాడారు. "పవన్‌ను ఇలాంటి పాత్రలో చూడటం చాలా గర్వంగా అనిపించింది. తనదైన ప్రత్యేక ఆకర్షణతో సినిమాను నిలబెట్టాడు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానులకు 'ఓజీ'తో సరైన విందు ఇచ్చాడు" అని చిరంజీవి వ్యాఖ్యానించారు. చిత్రానికి సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతం ఆత్మలాంటిదని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన తన అభినందనలు తెలియజేశారు.
Latest News