ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ఆర్థిక భరోసా -జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
రాష్ట్రంలోని ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పథకం అమలు తీరుపై సమీక్షించారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, అదనపు కలెక్టర్ దేవసహాయం, సీపీఓ సుజాత సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు అదనపు కలెక్టర్ దేవసహాయంను నోడల్ అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల ద్వారా నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు.
పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మండల స్థాయి అధికారులు, వార్డు అధికారులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ)పై శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపాలిటీలకు ప్రత్యేక లాగిన్ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు.
జిల్లాలోని ప్రతి నమోదు శిబిరంలో ఇంటర్నెట్ కనెక్షన్, ప్రింటర్, స్కానర్ తదితర అవసరమైన సాంకేతిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖల సమన్వయంతో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పథకంపై అవగాహన కల్పించి, ఎవరూ మిగిలిపోకుండా నమోదు ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు జిల్లా కలెక్టర్ వివరించారు.
సందడి రవీందర్ రెడ్డి,నాగర్‌కర్నూల్,రూరల్, సూర్య న్యూస్