గ్రామాభివృద్ధికి ఆశీర్వదించండి రామలకోటలో సర్పంచ్ అభ్యర్థి ఆచారి సావిత్రమ్మ ఇంటింటి ప్రచారం
వెల్దుర్తి, మేజర్ న్యూస్: గ్రామ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపించాలని రామలకోట సర్పంచ్ అభ్యర్థి ఆచారి సావిత్రమ్మ ఓటర్లను అభ్యర్థించారు. మండలంలోని రామలకోట గ్రామంలో ఆమె మద్దతుదారులతో కలిసి విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి గడపకూ వెళ్లి వృద్ధులు, మహిళలు, యువతను ఆప్యాయంగా పలకరిస్తూ తనకు ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. గ్రామంలో నెలకొన్న తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు తదితర మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.