అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యం
అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యం
కర్నూలు, నవంబర్ 18:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అక్షరాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారు సంబంధిత అధికారులను ఆదేశించారు.
అక్షరాంధ్ర రెండో దశ అమలు
ప్రస్తుతం అక్షరాంధ్ర కార్యక్రమం రెండో దశ కొనసాగుతోంది. ఈ దశలో కర్నూలు జిల్లాలో 1,89,571 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అక్షరాస్యత కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా DRDA, DWMA, MEPMA శాఖల సమన్వయంతో వాలంటీర్ టీచర్ల సహకారంతో అభ్యాసకులకు అక్షరాస్యత పాఠాలు బోధిస్తున్నారు.
ఈ కేంద్రాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఏపీఎంలు, ఏపీవోలు, సీసీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ గారు ఆదేశించారు. ప్రతి అక్షరాస్యత కేంద్రంలో వాలంటీర్ టీచర్లు తప్పనిసరిగా హాజరై బోధనా కార్యక్రమాలు నిర్వహించాలని, వారి హాజరును క్రమం తప్పకుండా నమోదు చేయాలని సూచించారు. అభ్యాసకుల హాజరును పెంచడంతో పాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 100 గంటల అభ్యసనాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అక్షరాంధ్ర మూడో దశ – 2027 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు
ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అక్షరాంధ్ర కార్యక్రమం మూడో దశను 2027 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ దశలో మిగిలిన నిరక్షరాస్యులందరినీ గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యం. 2027 సెప్టెంబర్‌లో అక్షరాస్యత మూల్యాంకన పరీక్ష నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
అక్షరాంధ్ర మొదటి, రెండో దశల్లో ప్రధానంగా 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే, ముఖ్యమంత్రి గారు 59 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులను కూడా అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఆదేశించిన నేపథ్యంలో, వారిని కూడా అక్షరాంధ్ర కార్యక్రమం పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దీంతో 15 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులందరినీ గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
కర్నూలు జిల్లాలో 3,91,509 మంది నిరక్షరాస్యుల గుర్తింపు
కర్నూలు జిల్లాలో గుర్తించిన నిరక్షరాస్యుల వివరాలను ఇప్పటికే అక్షరాంధ్ర యాప్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
* 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు వారు: 2,01,170 మంది
* 59 సంవత్సరాలు పైబడిన వారు: 1,90,339 మంది
* మొత్తం: 3,91,509 మంది
ఈ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన నిరక్షరాస్యులను గుర్తించి వాలంటీర్ టీచర్లతో మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గారు ఆదేశించారు.
నవంబర్ 25లోగా నమోదు, వెరిఫికేషన్ మరియు మ్యాపింగ్ పూర్తి చేయాలి
గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ, వార్డు సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, డిజిటల్ అసిస్టెంట్లు గ్రామాల్లోని VOAలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమన్వయం చేసుకోవాలి. పట్టణ ప్రాంతాల్లో సంబంధిత సచివాలయ సిబ్బంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు (COలు), రిసోర్స్ పర్సన్ల (RPs) సహకారంతో ఈ ప్రక్రియను చేపట్టాలి.
ఇప్పటికే అక్షరాస్యులైన వారు, మరణించిన వారు, వలస వెళ్లిన వారు, మంచానికే పరిమితమైన వారు మరియు మానసిక స్థితి సరిగా లేని వారిని నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం గుర్తించి జాబితా నుంచి తొలగించాలి. మిగిలిన అర్హులైన నిరక్షరాస్యుల వివరాలను ధృవీకరించి, అక్షరాంధ్ర యాప్‌లో నమోదు చేసి వాలంటీర్ టీచర్లతో మ్యాపింగ్ చేయాలి.
ఈ నమోదు, డేటా వెరిఫికేషన్ మరియు మ్యాపింగ్ ప్రక్రియను 2026 నవంబర్ 25వ తేదీలోగా తప్పనిసరిగా పూర్తి చేయాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు.
అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రతి నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గారు సూచించారు.