బెస్తలకు తీరని ఎస్టీ జాబితా కల - అమలుకు నోచుకోని హామీలు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : దశాబ్దాల తరబడి మత్స్యకారులైన బెస్త సంఘీయులను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న కల నెరవేరలేదు. నేతలు ఎందరో ఇచ్చిన హామీలు అమలు కు నోచుకోలేదు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో ఉద్యమాలు చేసిన బెస్త సంఘీయులు 2009లో ఢిల్లీలో కూడా ధర్నా చేశారు. అప్పట్లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ వారికి హామీ ఇచ్చినా అమలు కాకపోగా 2014 నుండి అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అయినా పట్టించుకోవాలని మత్స్యకారులైన బెస్త సంఘీయులను ఎస్సీల జాబితాలో చేర్చాలని వారంతా కోరుతూనే ఉన్న తమ కోరిక నెరవేర్చడం లేదని వారంతా ఆవేదంతో ఉన్నారు. 2009లో ఆంధ్రప్రదేశ్ నుండి అప్పటి రాష్ట్ర బెస్త సంక్షేమ సంఘం నాయకులు దివంగత వివి శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాలకు చెందిన సంఘ నాయకులు 200 మంది ఢిల్లీకి వెళ్ళగా నెల్లూరు జిల్లా నుండి ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు పుట్టుబోయిన సుబ్బరాయుడు, జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, మద్దినేని నారాయణ, సిహెచ్ రాజశేఖర్లు కూడా వెళ్లి పార్లమెంట్ భవన ఎదుట ధర్నా నిర్వహించారు. అనాదిగా అన్ని రంగాల్లో ఆర్థిక అభివృద్ధికి నోచుకొనక నానా అవస్థలు పడుతున్నామని,కులవృత్తితో జీవనం సాగించాలంటే తగిన అవకాశాలు లేవని, తమ కులాన్ని ఎస్టీల జాబితాలో చేర్చితే అన్ని రంగాల్లో సంక్షేమ ఫలాలు అందుకోగలమని అభివృద్ధి చెందగలమని వారు పేర్కొన్నారు.మహారాష్ట్రకు చెందిన ఎంపీ రాథోడ్ వివిధ రాష్ట్రాల అధ్యక్షులతో కలిసి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని కలిసామని, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం,మీరా కుమార్ తదితరుల కేంద్ర మంత్రులను కూడా కలిసామని తమ గోడు వినిపించి వినతి పత్రాలు సమర్పించగా తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చారని ఆ సంఘ నాయకులు పేర్కొన్నారు. 1970 నుండి పీవీ నరసింహారావు, జలగం వెంగళ రావు తదితరులఅందరికీ విన్నవించినా తమ సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. నేషనల్ బీసీ కమిషన్, ఏఐటీయూ, సిఐటియు కేంద్ర నాయకులకు కూడా వినతి పత్రాలు ఇచ్చామన్నారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో మినహా మిగతా చోట్ల బెస్తలు ఎస్టీలుగా ఉన్నారని,ఆంధ్ర ప్రదేశ్ తో సహా మరో ఐదు రాష్ట్రాల్లోనే బీసీలుగా ఉన్నామని వారు వివరించారు.తమ విన్నపంతో సానుకూలంగా స్పందించినప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రానున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టి బెస్తలను ఎస్టీలు జాబితాలో చేర్చతామని స్పష్టమైన హామీ ఇచ్చారని బెస్త సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పుట్టుబోయిన సుబ్బరాయుడు పేర్కొన్నారు. కానీ ఈ నాటికి ఇచ్చిన హామీలు నెరవేర్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ నేత సోనియాగాంధీ హామీతో తప్పక తమ ఆశ నెరవేరుతుందని,ఫలించగలవని గంపెడాశ, కొండంత విశ్వాసంతో ఢిల్లీ నుండి ఆనాడు తిరిగి వచ్చామని, వారు అధికారంలో ఉన్నంతవరకు ఆశపడి అనంతరం ఆశలు వదులుకొని నూతన ప్రభుత్వం పై ఆశతో ఉన్నామని సుబ్బరాయుడు పేర్కొన్నారు.ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పలువురు మంత్రులు తదితరులు అందరికీ పత్రాలను అందజేసి ఉన్నామని అయినా ఫలితం లేకపోయిందని, ప్రస్తుతం కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అయినా తమ న్యాయమైన కోరికను ఆమోధించి బెస్తలను ఎస్టీలు జాబితాలో చేర్చాలని వారు కోరుతున్నారు.