|
|
by Suryaa Desk | Wed, Oct 29, 2025, 09:52 PM
నిరుద్యోగ యువతకు హైదరాబాద్ పోలీసులు గుడ్‌న్యూస్ చెప్పారు. పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ డెక్కన్ బ్లాస్టర్స్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని మెహిదీపట్నంలోని రూప్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబర్ 30న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ మెగా జాబ్ మేళా జరగనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ జాబ్ మేళాలో ఐటీ, సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, ఫార్మసీ, ఇతర ప్రైవేట్ పరిశ్రమలతో సహా వివిధ రంగాలలో ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. అనుభవం లేని ప్రతిభావంతులైన ఫ్రెషర్స్‌కు, అలాగే అనుభవం ఉన్న అభ్యర్థులకు కూడా వారి విద్యార్హతలను బట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
అర్హతలు: ఎస్‌ఎస్‌సీ ( SSC ), ఐటీఐ ( ITI ), డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్ , బీఫార్మసీ , లేదా ఎంఫార్మ్ వంటి విద్యార్హతలు కలిగిన యువతీ, యవకులు ఈ మేళాలో పాల్గొనడానికి అర్హులు. ఈ ఉద్యోగ మేళా కేవలం హైదరాబాద్ యువతకే పరిమితం కాదని.. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నివాసితులు కూడా తమ విద్యార్హత, వ్యక్తిగత వివరాలతో సహా హాజరు కావచ్చునని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన ధైర్యవంతులైన పోలీస్ సిబ్బంది సేవలను స్మరించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసులు రక్షించిన సమాజానికి సేవ చేయడం ద్వారా వారి త్యాగాన్ని గౌరవించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నిరుద్యోగులైన, అర్హత కలిగిన యువత పెద్ద సంఖ్యలో ఈ ఉద్యోగ మేళాకు హాజరు కావాలని, ఉద్యోగావకాశాన్ని దక్కించుకోవాలని అధికారులు ప్రోత్సహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో హాజరై, ఈ ముఖ్యమైన సామాజిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.