|
|
by Suryaa Desk | Fri, Oct 17, 2025, 05:06 PM
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మన ఉద్యోగాలను లాక్కుంటుందని ఆందోళన చెందడం కంటే, దానిని వేగంగా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న మన సహోద్యోగుల గురించి ఆందోళన చెందడం మంచిదని డెలాయిట్ గ్లోబల్ ఏఐ లీడర్ నితిన్ మిట్టల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలైన పోటీ టెక్నాలజీతో కాదని, ఆ టెక్నాలజీని అందిపుచ్చుకున్న తోటి ఉద్యోగులతోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ ఛానల్ వరల్డ్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ఆయన, "ఏఐ మన ఉద్యోగాలను తీసేస్తుందా?" అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. "సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కస్టమర్ సపోర్ట్, కాల్ సెంటర్లు, కోడింగ్ వంటి కొన్ని ఉద్యోగాలపై ఏఐ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఏఐ వల్ల నేరుగా ఒక్క ఉద్యోగం కూడా పోలేదు. ఏఐతో ఎలా పనిచేయాలో తెలుసుకున్న మరో వ్యక్తి వల్లే ఉద్యోగాలు పోతున్నాయి" అని ఆయన వివరించారు.టెక్నాలజీకి అనుగుణంగా తమను తాము మార్చుకోకుండా, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఆసక్తి చూపకుండా ఖాళీ సమయంలో సోషల్ మీడియా చూస్తూ గడిపేవారు కచ్చితంగా వెనుకబడిపోతారని మిట్టల్ హెచ్చరించారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని పక్కనపెట్టి, ఏఐ ద్వారా పుట్టుకొస్తున్న కొత్త ఆర్థిక వ్యవస్థ, అది సృష్టించే సరికొత్త ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.