|
|
by Suryaa Desk | Sun, Jun 15, 2025, 01:40 PM
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ నెలాఖరులోపు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందని, త్వరలో ఎన్నికల తేదీలను ప్రకటిస్తామని ఆదివారం (15-06-2025) ఖమ్మం జిల్లా కూసుమంచిలో పర్యటన సందర్భంగా తెలిపారు. కూసుమంచిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నాయకులతో సమావేశమై, ఎన్నికల సన్నద్ధతపై కీలక సూచనలు చేశారు. రేపటి (16-06-2025) కేబినెట్ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటామని, ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.
మంత్రి పొంగులేటి గ్రామీణ నాయకులకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎన్నికలు రావడానికి కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఉందని, గ్రామాల్లో చిన్నపాటి లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. రిజర్వేషన్ల ఆధారంగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. స్థానిక నాయకులు ఎన్నికల సన్నద్ధతలో చురుకుగా పాల్గొని, ప్రజలతో సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
రాబోయే వారంలో అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకం కింద ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని ఎకరాలకు ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. సన్నకారు రైతులకు బోనస్ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించి, వారిలో అవగాహన కల్పించాలని స్థానిక నాయకులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయడమే కాక, వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరారు.