telangana
విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలి: సీఐ కిరణ్
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఘట్‌కేసర్ సీఐ కిరణ్ సూచించారు. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆల్ఫోర్స్ పాఠశాలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులతో పోలీస్ స్టేషన్‌లో ఓపెన్‌హౌస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పోలీసుల విధులు, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, చట్టాల అమలు, ఆపద సమయంలో పోలీసులు అందించే సహాయంపై విద్యార్థులకు వివరించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడల ద్వారా ఐక్యత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.