జిల్లా పరిషత్ చైర్మన్ నిమ్మల నీలిమకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర
పార్వతీపురం, సూర్య: పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్ చైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన భామిని జడ్పీటీసీ సభ్యురాలు నిమ్మల నీలిమ శనివారం పార్వతీపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర నిమ్మల నీలిమకు పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించి, జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని మండలాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని సూచించారు.జిల్లా సమగ్ర అభివృద్ధిలో జిల్లా పరిషత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులందరూ పరస్పర సమన్వయంతో పనిచేస్తే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా నిమ్మల నీలిమ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హామీ ఇచ్చారు.