బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
- కిశోర బాలల ఆరోగ్యమే లక్ష్యంగా ఏఎఫ్‌హెచ్‌సీ క్లినిక్‌ల నిర్వహణ
- జిల్లా ఆర్‌బీఎస్‌కే అధికారి డాక్టర్ జగన్ మోహన్
పార్వతీపురం, సూర్య: బాలికల ఆరోగ్య వికాసానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) అధికారి డాక్టర్ టి. జగన్ మోహన్ రావు అన్నారు. రాష్ట్రీయ కిశోర స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌కేఎస్‌కే)లో భాగంగా శనివారం స్థానిక జూనియర్ కళాశాలలో కిశోర బాలికల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలను పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. డాక్టర్ జగన్ మోహన్ మాట్లాడుతూ 10 నుంచి 19 సంవత్సరాల వయస్సును కిశోర దశగా పరిగణిస్తారని, ఈ వయస్సులో బాలబాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. ఇందుకోసం ఏఎఫ్‌హెచ్‌సీ క్లినిక్‌లను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రక్తహీనత నివారణ, ఐఎఫ్‌ఏ మాత్రల వినియోగం, పోషకాహారం, బాల్యవివాహాల దుష్పరిణామాలు, యుక్తవయస్సులో గర్భధారణ వల్ల కలిగే అనర్థాలు, రుతుస్రావ పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం, కౌన్సెలింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పీర్ ఎడ్యుకేటర్ల ద్వారా కూడా కిశోర బాలలకు ఆరోగ్య సమాచారాన్ని చేరవేయాలన్నారు.
గైనకాలజిస్ట్ డాక్టర్ సాగరిక ఆయా అంశాలపై విపులంగా వివరించి విద్యార్థినుల సందేహాలను నివృత్తి చేశారు. ఆరోగ్య సమస్యలను తెలియజేసిన విద్యార్థినులకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. మన్యం వీడియో డాక్టర్ ప్రత్యేక సేవల ద్వారా స్పెషలిస్ట్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆడ శిశువును కాపాడుకుందాం అనే లక్ష్యంలో భాగంగా పీసీపీఎన్‌డీటీ చట్టంపై అవగాహన కల్పించారు. కౌమార దశలో బాలికల ఆరోగ్యంపై చూపే శ్రద్ధ వారి బంగారు భవిష్యత్తుకు పునాది అవుతుందని, ఇది వివిధ శాఖల సమన్వయంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు వైద్య సిబ్బంది అక్కడ నిర్వహించిన ఆర్.బి.ఎస్.కె స్క్రీనింగ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ రాజు, వైద్యాధికారి డాక్టర్ రవిచంద్ర, గైనకాలజిస్ట్ డాక్టర్ సాగరిక, డెమో ప్రసాద్, సూపర్‌వైజర్ పుష్ప, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.