ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవమానం.. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఖండన
వికారాబాద్,మేజర్ న్యూస్: మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్న ప్రభుత్వ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేకు ప్రభుత్వ కార్యక్రమంలో కనీస గౌరవం ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా నిర్వహించాల్సి ఉండగా, రాజకీయ వేదికలుగా మార్చడం సరికాదన్నారు. ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రజాప్రతినిధికి ప్రోటోకాల్ ప్రకారం గౌరవం కల్పించకుండా, ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందని నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి సీనియర్ నాయకురాలని, మాజీ మంత్రిగా, ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేగా ఆమెకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధ్యులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజమని, అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు.