బాల్యవివాహ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
-- బాలల రక్షణ అధికారి ఎం మల్లేశ్వరరావు
శ్రీకాకుళం-మేజర్ న్యూస్: బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, ఈ సామాజిక దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సంస్థాగత బాలల రక్షణాధికారి ఎం. మల్లేశ్వరరావు పేర్కొన్నారు. బాలల హక్కుల వారోత్సవాలు, 'బాల్ వివాహ ముక్త్ భారత్' కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రోడ్డు నారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో జిల్లా బాలల రక్షణ విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్ లక్కీనేని కవిత, దోమ రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మల్లేశ్వరరావు మాట్లాడుతూ, బాల్యవివాహాల వల్ల పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు గానీ, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు.
అనంతరం సమీపంలోని భవన నిర్మాణ కార్మికులకు జాతీయ దత్తత అవగాహన మాసంపై అవగాహన కల్పించారు. బాలల రక్షణ అధికారి (ఎన్ఐసీ) ఇప్పిలి లక్ష్మీనాయుడు మాట్లాడుతూ, సంతానం లేని దంపతులు పిల్లలను దత్తత తీసుకోవాలంటే మధ్యవర్తులను ఆశ్రయించకుండా కారా (సీఏఆర్ఏ) నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన విధానాన్నే అనుసరించాలని స్పష్టం చేశారు. పిల్లలను పెంచలేని పరిస్థితుల్లో ఉన్నవారు వారిని రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో వదిలివేయకుండా జిల్లా బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ) లేదా జిల్లా బాలల రక్షణ విభాగానికి సురక్షితంగా అప్పగించాలని కోరారు. అనంతరం విద్యార్థులు, భవన కార్మికులతో కలిసి బాల్యవివాహాలకు వ్యతిరేకంగా మానవహారం నిర్వహించి, సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ధర్మాన సీతారాములు, బాలల రక్షణ విభాగం సిబ్బంది ఐ. జనార్దన్, ఎస్. గీత, ఎస్. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.