పీడీఎస్యూ 24వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ.
పలాస, నవంబర్ 21,మేజర్ న్యూస్.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) ఆంధ్రప్రదేశ్ 24వ రాష్ట్ర మహాసభల లోగోను శనివారం పలాసలో ఘనంగా ఆవిష్కరించారు.పలాస సూదికొండ కాలనీలోని పీడీఎస్యూ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్ కుమార్ లోగోను ఆవిష్కరించారు. ఈ మహాసభలు 2027 జనవరి 5,6,7 తేదీలలో తిరుపతి నగరంలో జరగబోతున్నాయని ఆయన తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గత 54 సంవత్సరాలుగా విద్యార్థుల హక్కుల కోసం, శాస్త్రీయ విద్య సాధన కోసం, లౌకిక ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పీడీఎస్యూ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు.దేశంలో విద్యా వ్యాపారీకరణ పెరిగి విద్యారంగం కార్పొరేట్ కబంధహస్తాల్లో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ వచ్చిన తర్వాత దేశంలో రోజురోజుకీ నిరుద్యోగ సమస్య పెరుగుతుందన్నారు. ఉన్నత విద్యావంతులకు సైతం ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని పేర్కొన్నారు.
జెన్-జీ పోరాటాలకు మద్దతు.
పేపర్ లీకేజీల నుండి ప్రారంభమైన జెన్-జీ పోరాటాలు ఈరోజు దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పైన, విద్యా వ్యాపారీకరణకు వ్యతిరేకంగా ముందుకు వస్తున్నాయని వినోద్ కుమార్ ఆరోపించారు.ఇటువంటి తరుణంలో గత ఉద్యమాలను సమీక్షించుకుని, భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించుకునేందుకు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు, చదువుకున్న ప్రతి విద్యార్థికి శాశ్వతమైన గౌరవప్రదమైన ఉద్యోగం కోసం పోరాటాల నిర్వహణకు ఈ మహాసభలు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.ఈ మహాసభలను జయప్రదం చేయాలని విద్యార్థులకు, యువతకు ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విజయ్,దయ,మహేష్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.