కోటబొమ్మాళిలో ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ
కోటబొమ్మాళి, నవంబరు 21, మేజర్ న్యూస్: మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా కొత్తపల్లి, కిస్టుపురం, తర్లిపేట, కోటబొమ్మాళి, లఖందిడ్డి, జర్జంగి, సౌడం, తిలారు, హరిశ్చంద్రపురం, నిమ్మాడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రాల పరిధిలో శనివారం అభ్యర్థులు పెద్ద ఎత్తున తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కేంద్రాల పరిధిలో సర్పంచ్ పదవులకు 47 మంది అభ్యర్థులు, అలాగే 180 వార్డు స్థానాలకు పలువురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సంబంధిత ఎన్నికల అధికారులకు (ఆర్వోలకు) అందజేసినట్లు ఎంపీడీవో కిల్లారి నారాయణరావు తెలిపారు. కాగా, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు మండలంలోని అన్ని కేంద్రాల వద్ద ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎస్ఐ వి. సత్యనారాయణ వెల్లడించారు.