స్కానింగ్ కేంద్రాలపై నిరంతర నిఘా
-- డీఎంహెచ్‌వో డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్ కుమార్
శ్రీకాకుళం-మేజర్ న్యూస్: గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పీసీపీఎన్‌డీటీ) అమలును పకడ్బందీగా పర్యవేక్షించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేష్ కుమార్ ఆదేశించారు. శనివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన పీసీపీఎన్‌డీటీ జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలలోని సీసీ కెమెరాలు, సంబంధిత రికార్డులు, ఫారమ్-ఎఫ్ వివరాలను ప్రోగ్రామ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. ఈ చట్టం ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు, సమాచారాన్ని ప్రజలు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబరు 18002332447 ద్వారా అందించవచ్చని తెలిపారు. అనంతరం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించిన డీఎంహెచ్‌వో బాల్య వివాహాలను అరికట్టడం ద్వారా టీనేజ్ గర్భధారణలను నిరోధించవచ్చని, తద్వారా మాతాశిశు మరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. అన్ని పీహెచ్‌సీలలో సహజ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని, 14 ఏళ్లు పూర్తయిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను శతశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలలో నిర్వహించనున్న 'బాల్య వివాహ ముక్త భారత్', తక్కువ బరువుతో జన్మించే శిశువుల (ఎల్‌బీడబ్ల్యూ) సంరక్షణ కార్యక్రమాలపై గ్రామ కమిటీ సభ్యులు, అంగన్వాడీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సమన్వయంతో గ్రామస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో సలహా కమిటీ సభ్యులు, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రామ్స్, డాక్టర్ శివరంజిని, డాక్టర్ సుజాత, డాక్టర్ బి. రవీంద్ర, డాక్టర్ ప్రవీణ్, హెచ్‌ఈవో ముఖలింగం, డిప్యూటీ హెచ్‌ఈవో పి. మోహిని రత్నకుమారి పాల్గొన్నారు.