ప్రశాంతంగా ముగిసిన అరసవల్లి, శ్రీకూర్మం తెప్పోత్సవాలు
-- జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి
శ్రీకాకుళం-మేజర్ న్యూస్: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలోని ఇంద్ర పుష్కరిణిలో శనివారం సాయంత్రం నిర్వహించిన తెప్పోత్సవం పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసు శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సి.హెచ్ ధనుంజయ నాయుడు,మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్ల క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భక్తుల రాకపోకల పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇతర శాఖల సమన్వయంతో ఇంద్ర పుష్కరిణి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి, ముందస్తు జాగ్రత్తగా ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా గార మండలంలోని శ్రీకూర్మం శ్రీ కూర్మనాథ స్వామి ఆలయ శ్వేత పుష్కరిణిలో నిర్వహించిన తెప్పోత్సవం కూడా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ వెంకట రమణ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసింది.రెండు ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. తెప్పోత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన భక్తులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.