|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 11:08 PM
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాగా.. ప్రస్తుతం ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కాగా, ఈ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి, సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలకు నిర్మాణ సామగ్రిని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. సిమెంటు, స్టీల్, ఇటుక వంటి నిర్మాణ సామగ్రి ధరలను మండల స్థాయిలో నిర్ణయించడానికి ధరల నిర్ణయ కమిటీలు సమావేశం కావాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం (జూన్ 30) అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఇప్పటికే 20 ప్రాంతాల్లో ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు భట్టి వెల్లడించారు. ఇసుక సామాన్యులకు మరింత అందుబాటులో ఉండేలా మార్కెట్ యార్డులు, ప్రభుత్వ స్థలాల్లో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దీని వల్ల ఇసుక కొరతను నివారించడమే కాకుండా.. అక్రమ ఇసుక రవాణాను కూడా నియంత్రిస్తుందని తెలిపారు. సర్కార్ నిర్ణయం వల్ల నిర్మాణ వ్యయం తగ్గి, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం మరింత సులభతరం అవుతుందని భావిస్తున్నారు.
అదే సమయంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం ద్వారా అక్రమ లే అవుట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయంపైనా అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా గిరిజనులే ఇసుక క్వారీలను నిర్వహించేలా ప్రోత్సహించడం ద్వారా వారికి ఆర్థిక సాధికారత కల్పించాలని నిర్ణయించారు. కాలుష్య నియంత్రణకు గాను హైదరాబాద్‌లోని కాలుష్యకారక పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించే అంశంపై కూడా చర్చించారు. గనుల శాఖలో వన్-టైమ్ సెటిల్‌మెంట్ విధానాన్ని అమలు చేయడం ద్వారా పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆర్థిక వనరుల సమీకరణపై ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) ఆధ్వర్యంలో ప్రతిరోజు సమీక్ష నిర్వహించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ నిరంతర సమీక్షల వల్ల ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల అమలులో జాప్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.