|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 07:44 PM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు తీసుకుంటున్న చర్యల పట్ల తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఓ పిటిషన్ విచారణ సందర్భంగా అధికారుల నిర్లక్ష్యంపై మండిపడింది. అటువంటి అధికారుల ఫోటోలు ట్యాంక్‌బండ్‌పై ప్రదర్శించాలని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజేంద్రనగర్‌లోని తమ ప్రైవేటు భూమిలో కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని.., ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని నగరానికి చెందిన సయ్యద్ రహీమున్నీసా సహా మరో ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణలో భాగంగా పిటిషన్ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోటం ఏందని అధికారులను ప్రశ్నించారు. అటువంటి అధికారుల ఫోటోలను ప్రజలందరూ చూసే విధంగా ట్యాంక్ బండ్‌పై ప్రదర్శించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని స్టాండింగ్ కౌన్సిల్ పేర్కొంది. జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం టాస్క్ ఫోర్స్ అధికారులకు ఉత్తర్వులు పంపించామని అంటున్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులేమో పోలీసుల నుండి భద్రత లేదని, తమకు సహకారం అందడం లేదని చెబుతున్నారు. ఇది శాంతిభద్రతల సమస్య అని పోలీసులు చెబుతున్నారు. ఇలా అందరూ చేతులు దులుపుకుంటే ఎలా?' అంటూ హైకోర్టు ధర్మాసనం అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టేయడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే వాయిదాలోగా పిటిషనర్ ఇచ్చిన వినతి పత్రంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటన అక్రమ నిర్మాణాల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, అధికారుల నిర్లక్ష్యాన్ని మరోసారి స్పష్టం చేసింది. హైకోర్టు వ్యాఖ్యలు అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతాయని ప్రజలు ఆశిస్తున్నారు.