|
|
by Suryaa Desk | Tue, Jul 01, 2025, 07:36 PM
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడు, హిప్నాటిస్ట్ బీవీ పట్టాభిరామ్ (75) ఇక లేరు. గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి బీవీ పట్టాభిరామ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పట్టాభిరామ్‌కు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఖైరతాబాద్‌లోని ఆయన సొంతింట్లో పట్టాభిరామ్ పార్థివదేహాన్ని బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఉంచనున్నారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బీవీ పట్టాభిరామ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
బీవీ పట్టాభిరామ్ పూర్తి పేరు.. భావరాజు వెంకట పట్టాభిరామ్. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు. తండ్రి పేరు భావరాజు సత్యనారాయణ. పదిహేను మంది సంతానంలో బీవీ పట్టాభిరామ్ కూడా ఒకరు. చిన్నప్పుడు కాలి వైకల్యం కారణంగా బీవీ పట్టాభిరామ్ ఆత్మన్యూనతా భావంతో బాధపడేవారు. అయితే దానిని జయించి రచయితగా, ఇంద్రజాలికుడిగా, మానసిక వైద్యుడిగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశీలిగా ఎదిగారు. అయితే మ్యాజిక్‌లో ఆయన మ్యాజిక్ ప్రపంచానికి తెలిసింది మాత్రం.1984లో. కళ్లకు గంతలు కట్టుకుని హైదరాబాద్ రవీంద్రభారతి నుంచి చార్మినార్ వరకు స్కూటర్ నడిపి బీవీ పట్టాభిరామ్ కొత్త అధ్యాయాన్ని సృష్టించారు.
బీవీ పట్టాభిరామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీలో, నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీలో పీహెచ్‌డీ పొందారు. హిప్నోటిజం, సాఫ్ట్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసంపై వర్క్‌షాప్‌లు నిర్వహించారు. చాణక్య తంత్రం, పాజిటివ్ థింకింగ్, మైండ్ మ్యాజిక్, గుడ్ పేరెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మాయవినోదం, మాటే మంత్రం, బంగారు బాట వంటి రచనలు చేశారు. మూఢనమ్మకాలు, మద్యపానం వలన కలిగే అనర్థాలు వివరిస్తూ ప్రచారం చేశారు. కొన్ని టీవీ సీరియళ్లతో పాటుగా.. రెండురెళ్లు ఆరు అనే సినిమాలోనూ ఆయన నటించారు.
బీవీ పట్టాభిరామ్ మృతిపై చంద్రబాబు, జగన్ సంతాపం
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ మరణంపై సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బీవీ పట్టాభిరామ్ ఆకస్మిక మృతి తనను బాధించిందన్న చంద్రబాబు.. వ్యక్తిత్వ వికాస బోధనలతో, రచనలతో ఎంతో మందిని ప్రభావితం చేసిన బీవీ పట్టాభిరామ్ అన్నారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. బీవీ పట్టాభిరామ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.