![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 07:33 PM
లీగల్ డ్రామాగా రూపొందిన కన్నడ సినిమానే 'యుద్ధకాండ - చాప్టర్ 2'. అజయ్ రావు .. ప్రకాశ్ బెలవాడి .. అర్చన జోస్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, పవన్ భట్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 20వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ లీగల్ డ్రామా ఏ అంశం చుట్టూ తిరిగిందనేది చూద్దాం.
కథ: భరత్ (అజయ్ రావు) ఓ అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన, ఒక హోటల్లో పనిచేస్తూనే ఎదుగుతాడు. కష్టపడి చదువుతూ 'లా' పూర్తి చేస్తాడు. నీతి .. నిజాయితీ .. ఇతరుల పట్ల సానుభూతి కలిగిన భరత్, ఒక పేరున్న సీనియర్ లాయర్ దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. అనుభవం కోసం జీతం లేకుండానే పనిచేస్తూ ఉంటాడు. అక్కడే అతనికి 'స్వప్న' పరిచయం అవుతుంది. ఆమె పరిచయం అతనిలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది.ఒక రోజున భరత్ ఒక కేసు విషయంగా కోర్టుకు వెళతాడు. ఆ కోర్టు ఆవరణలో ఎమ్మెల్యే జగన్నాథ్ తమ్ముడు జనార్దన్ ను నివేదిత ( అర్చన జోస్) షూట్ చేస్తుంది. జనార్థన్ అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో పోలీసులు నివేదితను అదుపులోకి తీసుకుంటారు. ఆమెకి కఠిన శిక్ష పడేలా చేయాలని ఎమ్మెల్యే జగన్నాథ్ నిర్ణయించుకుంటాడు. ఈ విషయంపై క్రిమినల్ లాయర్ రాబర్ట్ ను కలుస్తాడు. ఆయన నుంచి కోట్లలో ఫీజు వసూలు చేసిన రాబర్ట్, రంగంలోకి దిగుతాడు. ఈ నేపథ్యంలోనే నివేదితను భరత్ కలుసుకుంటాడు. ఎందుకు ఆమె జనార్థన్ ను షూట్ చేయవలసి వచ్చిందో చెబితే, సహాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటాడు. అప్పుడు నివేదిత ఏం చెబుతుంది? ఆమె విషయంలో జనార్థన్ చేసినదేమిటి? అది తెలుసుకున్న భరత్ ఏం చేస్తాడు? నివేదిత దోషిగా తేలుతుందా? నిర్దోషిగా బయటపడుతుందా? అనేది మిగతా కథ.
Latest News