telangana
విద్యార్థి సమస్యలపై పోరుబాట - ఏఐపీఎస్యూ జిల్లా కమిటీ ఏర్పాటు
సూర్య నస్పూర్ : విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణే లక్ష్యంగా అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (ఏఐపీఎస్యూ) మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా సి హెచ్ మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా మిట్టపల్లి తిరుపతిని నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు బోడ అనిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే కుమార్ వెల్లడించారు. మంగళవారం నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిటీ నియామకాలను అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 5న రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశంలో నియామకాలకు ఏకగ్రీవ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని, కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచడంతోపాటు అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడు మల్లేష్, ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ, తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ, హాస్టళ్లలో మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం కల్పన, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం పోరాడతామన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి, వారి హక్కుల సాధనకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు.