ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల విస్తృత తనిఖీలు
విజయవాడ మేజర్ న్యూస్ : ఎన్.టి.ఆర్. పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం నేతృత్వంలో ట్రాఫిక్ ఏసీపీలు, ఆయా ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా కమిషనరేట్ పరిధిలోని ముఖ్యమైన కూడళ్ల వద్ద ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 1,500 ఆటోల వెనుక భాగంలో ఏర్పాటు చేసిన మూసివేసిన కవర్లను తొలగించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఆటోల వెనుక కవర్లు మూసివేసి ఉండటం వల్ల డ్రైవర్లకు వెనుక నుంచి వచ్చే వాహనాల కదలికలు సరిగా కనిపించక ఓవర్‌టేక్ చేసే సమయంలో, మలుపులు తిరిగేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఆటోల్లో ప్రయాణించే మహిళలు, పిల్లలు సహా ప్రయాణికులు బయటివారికి కనిపించకపోవడం వల్ల వారి భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ఈ కారణంగానే ప్రయాణికుల రక్షణ దృష్ట్యా వెనుక కవర్లను తొలగిస్తున్నట్లు వివరించారు. ఆటోల వెనుక భాగంలో ఎలాంటి మూసివేసిన కవర్లు ఏర్పాటు చేయకూడదని, వాహనంలో అనుమతించిన సంఖ్యకు మించి ప్రయాణికులను ఎక్కించరాదని డ్రైవర్లకు సూచించారు. వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడటం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం తీవ్రమైన నేరాలని హెచ్చరించారు. వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్, బీమా ధ్రువపత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని, పాఠశాల విద్యార్థులను తీసుకెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అదేవిధంగా డ్రైవర్ సీటు వెనుక భాగంలో ఆటో నంబరుతో పాటు అత్యవసర సహాయ నంబరు 112ను ప్రయాణికులకు కనిపించేలా ఏర్పాటు చేయాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలను స్వాధీనం చేసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. నగరంలో ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, వాహనదారులు, ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.