BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు

Select Suryaa Now
యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు

మచిలీపట్నం మేజర్ న్యూస్ : యువతలో నాయకత్వ లక్షణాలు, విశాల దృక్పథం, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు యూత్ పార్లమెంట్ పోటీలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027లో భాగంగా కృష్ణా జిల్లాలో యూత్ పార్లమెంట్ పోటీలు–2027 నిర్వహణకు ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల సుమారు 50 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఇలాంటి పోటీల్లో పాల్గొనడమే విద్యార్థులకు గొప్ప అభ్యాస అనుభవమని పేర్కొన్నారు. పుస్తకాలు, విద్యా సంబంధిత అంశాల ద్వారా పొందే పాఠ్య పరిజ్ఞానం మాత్రమే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు సాధించేందుకు సరిపోదని, క్షేత్రస్థాయి అనుభవం, ఆచరణాత్మక పరిజ్ఞానం, వివిధ అంశాలపై అవగాహన కూడా అవసరమని తెలిపారు. పోటీల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆలోచనా పరిధి విస్తరించడంతో పాటు విశాల దృక్పథం, విషయ పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని వివరించారు. గెలుపోటముల కంటే పాల్గొనడం ద్వారా పొందే అనుభవం, నేర్చుకునే అంశాలే భవిష్యత్తులో ఎక్కువగా ఉపయోగపడతాయని సూచించారు. ప్రస్తుత సమాచార ఆధారిత సమాజంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని యథాతథంగా స్వీకరించకుండా, అవసరమైన సమాచారాన్ని గుర్తించి విశ్లేషించి లక్ష్య సాధనకు ఉపయోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ముందుగానే లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినీ వంటి కృత్రిమ మేధ ఆధారిత వేదికలను సమర్థవంతంగా వినియోగించుకుని సమాచారాన్ని సేకరించడం, అంశాలను విశ్లేషించడం, ఆలోచనలకు స్పష్టమైన రూపం ఇవ్వడం నేర్చుకోవాలని తెలిపారు. ఈ సాధనాలను ఉపయోగించేటప్పుడు సరైన ప్రశ్నలు అడగడం, అవసరమైన సమాచారాన్ని పొందడం, దానిని విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడం వంటి నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోటీలు, క్షేత్రస్థాయి అనుభవాల ద్వారా సామర్థ్యాలను పెంపొందించుకుంటే భవిష్యత్తులో ఉద్యోగ, వృత్తి జీవితాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని దిశానిర్దేశం చేశారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి కె. రాంజీ, రిజిస్ట్రార్ డాక్టర్ ఉషా, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రావణి, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త, అధ్యాపకులు,  నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.