కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ!
చైర్పర్సన్ రేసులో ఇద్దరు మహిళా నేతలు..
అధిష్ఠానం మొగ్గు ఎటువైపు?
పార్టీ విధేయతకు ప్రాధాన్యమా.. రాజకీయ, ఆర్థిక సమీకరణాలకా?
కమ్మ సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుందన్న ప్రచారం
పామర్రు, మేజర్ న్యూస్ : కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠం ఎవరిని వరించనుందన్న అంశం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో రాజకీయ పార్టీల దృష్టి నవంబర్ 7న వెలువడిన ఫలితాలపై పడింది. ఫలితాల్లో వెల్లడయిన రాజకీయ బలబలాలతో పాటు పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎంపికలో కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మహిళా నేతల పేర్లు ప్రధానంగా ప్రచారంలోకి రావడం రాజకీయ ఆసక్తిని మరింత పెంచుతోంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీలో ఆ కేటగిరీకి చెందిన ఇరువురు మహిళలు పోటీపడుతున్నారు.
రేసులో పూజిత, ప్రవళి పేర్లు!
జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి మహిళలకు రిజర్వు కావడంతో ఆశావహులపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కంకిపాడు మండలం నుండి గెలుపొందిన దండమూడి పూజిత, పమిడిముక్కల మండలం నుండి గెలుపొందిన తాతినేని ప్రవళి పేర్లు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరికి పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వం నిర్వహించే అంతర్గత సమాలోచనలు ఈ ఎంపికపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తారా?
ఉమ్మడి కృష్ణా జిల్లా విభజన అనంతరం ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, వివిధ పదవుల కేటాయింపుల్లో సామాజిక సమతుల్యత అంశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్టీఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎస్సీ సామాజిక వర్గానికి, విజయవాడ మేయర్ పదవి కాపు సామాజిక వర్గానికి దక్కిన నేపథ్యంలో మిగిలిన కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళకు కేటాయించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ అంశంపై పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన వారికి గుర్తింపు దక్కేనా?
చైర్పర్సన్ రేసులో వినిపిస్తున్న దండమూడి పూజిత పేరు వెనుక ఆమె కుటుంబ రాజకీయ నేపథ్యం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఆమె భర్త దండమూడి చౌదరి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిర్వహించిన పలు నిరసనలు, ఆందోళన కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఆయనపై పలు కేసులు నమోదైనట్లు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల కోసం చురుకుగా పనిచేసిన కుటుంబాలకు గుర్తింపు ఇవ్వాలన్న అభిప్రాయం కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఈ కోణంలో పూజిత అభ్యర్థిత్వానికి ప్రాధాన్యం లభించవచ్చన్న చర్చ సాగుతోంది.
మరోవైపు ప్రవళి కుటుంబ నేపథ్యంపైనా చర్చ
ఇక తాతినేని ప్రవళి తండ్రి రమేష్ సైతం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి కూడా తగిన రాజకీయ గుర్తింపు కల్పించాలన్న చర్చ జరుగుతోంది. దీంతో పూజిత, ప్రవళి పేర్ల మధ్య పోటీ కేవలం వ్యక్తిగత ఆశావహతకే పరిమితం కాకుండా, ఆయా కుటుంబాల రాజకీయ సేవలు, పార్టీతో ఉన్న అనుబంధం చుట్టూ కూడా తిరుగుతోంది.
విధేయతకు పట్టమా? ఇతర సమీకరణాలకా?
చైర్పర్సన్ ఎంపికలో పార్టీ కోసం కష్టపడిన వారి సేవలు, రాజకీయ అనుభవం, విధేయతకు అధిష్ఠానం ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుందన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. మరోవైపు ఎన్నికల నిర్వహణలో కీలకంగా నిలిచే రాజకీయ, ఆర్థిక బలం, స్థానిక నాయకుల మద్దతు వంటి అంశాలు కూడా నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన కుటుంబాలకు పదవుల రూపంలో గుర్తింపు లభిస్తుందా? లేక అధిష్ఠానం వ్యూహాత్మక సమీకరణాలకే ప్రాధాన్యత ఇస్తుందా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో జిల్లాలో 26 మండలాలు ఉండగా 24 మండలాలలో కూటమి విజయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్‌పై ఎవరి ఆధిపత్యం ఏర్పడుతుంది? ఆశావహుల్లో ఎవరికి పార్టీ నాయకత్వం అండగా నిలుస్తుంది? అన్న అంశాలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. మెజారిటీ బలాబలాలు, సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల కుటుంబాల విధేయత, నాయకత్వం తీసుకునే రాజకీయ నిర్ణయాలు చైర్పర్సన్ ఎంపికను ప్రభావితం చేయనున్నాయి.
కమ్మ సామాజిక వర్గానికి కాకుండా ఇతర సామాజిక వర్గాలకు కేటాయించేట్లయితే అవనిగడ్డ నుండి గెలుపొందిన వికృతి విజయలక్ష్మి కూడా పోటీలో ఉన్నారు. ఈ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించగా అధిష్టానం ఆ కేటగిరిలోనే చైర్ పర్సన్ అవకాశం కల్పిస్తుందా లేక బీసీలకు పదవి కట్టబెడుతుందా అనేది కూడా జిల్లాలో చర్చనీయాంశంగా ఉంది.
మొత్తానికి కృష్ణాజిల్లా పరిషత్ పీఠం కోసం తెరవెనుక రాజకీయ కసరత్తు మొదలైనట్లు కనిపిస్తోంది. పూజితకు పార్టీ విధేయత కలిసొస్తుందా? ప్రవళికి కుటుంబ రాజకీయ నేపథ్యం బలమవుతుందా? లేక తెరపైకి మరో పేరు వస్తుందా? అన్నది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది. తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్ఠానం చేతుల్లోనే ఉండటంతో జడ్పీ చైర్పర్సన్ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 20వ తేదీన జడ్పీ చైర్మన్ ఎంపిక జరగవలసి ఉండటంతో మరో వారం రోజులపాటు సస్పెన్స్ కొనసాగుతుందా లేక ముందుగానే చైర్మన్ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తుందా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, కృష్ణాజిల్లా.