మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు
విజయవాడ మేజర్ న్యూస్ : భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ ఇస్లామిక్ పండితుడు, స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. దేశ విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆయన అంకితభావంతో పనిచేశారని, 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య అందించాలనే ఆలోచనను ముందుకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. బాలికలకు నాణ్యమైన విద్య అందించేందుకు కూడా అనేక పథకాలను ప్రవేశపెట్టారని వివరించారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1992లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించిందని, 2008 నుంచి ఆయన జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమరయోధుల్లో ప్రముఖ నాయకుడని, ప్రఖ్యాత పండితుడు, కవి అని, అరబిక్, ఆంగ్లం, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ తదితర భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారని గుర్తుచేశారు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్‌తో పాటు సి.ఎస్.బి., సి.సి.ఆర్.బి., సి.పి.ఓ. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.