telangana
రైతుల అభ్యున్నతే లక్ష్యం.. సంక్షేమమే ధ్యేయం
సూర్య కోనరావుపేట ;;రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. రైతులకు అవసరమైన సేవలను అందిస్తూ ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిగా నిలవాలని అన్నారు.సోమవారం కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో పీఏసీఎస్ నూతన అధ్యక్షుడు, పాలకవర్గ సభ్యుల అభినందన సభలో ఆది శ్రీనివాస్ పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మరిమడ్ల గ్రామంలో నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కొనుగోలు చేసే ప్రక్రియలో సహకార సంఘాలు చొరవ చూపాలన్నారు. వ్యవసాయ సీజన్లో ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాలు రైతులకు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైతుల సమస్యలను గుర్తించి పరిష్కరించడంతోపాటు వారి ప్రయోజనాలను కాపాడాలన్నారు. సంఘాల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.
- రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చాలనే లక్ష్యంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందన్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసి రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీరు, నాణ్యమైన విద్యుత్, అవసరమైన వ్యవసాయ వనరులు అందించడం ప్రభుత్వాల బాధ్యతని తెలిపారు.ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి, దాదాపు రూ.20,650 కోట్లను వెచ్చించినట్లు వివరించారు. రుణమాఫీతో రైతులకు బ్యాంకుల నుంచి తిరిగి రుణాలు పొందే అవకాశం ఏర్పడిందన్నారు.రాష్ట్రంలో ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు అండగా నిలవడం, నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ సబ్స్టేషన్లు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు భవనాల నిర్మాణం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో పాక్స్ చైర్మన్లు బొమ్మన భాస్కర్ రావు, చేపూరి గంగాధర్,మార్కెట్ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మానుక సత్యం, పాక్స్ మాజీ చైర్మన్ బండ నర్సయ్య యాదవ్,స్థానిక సర్పంచ్ లు జలగం అరవింద్ రావు, కోలా స్వాతి,మార్కెట్ వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్,సర్పంచుల ఫోరమ్ కన్వీనర్ దేవరాజు, వివిధ గ్రామాల సర్పంచులు, పాక్స్, మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.