కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి
- టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
*కోటబొమ్మాళి అక్టోబర్ 26, మేజర్ న్యూస్:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను, ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ‘చెప్పాం.. చేస్తున్నాం..’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి, ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని సగర్వంగా వివరించాలని పిలుపునిచ్చారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన కార్యాచరణపై పలు సూచనలు చేశారు.
2024 ఎన్నికల్లో ప్రజలు కూటమిపై నమ్మకంతో అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని,ప్రతి ఓటరుకు అర్థమయ్యేలా వివరించాలని నాయకులకు సూచించారు. పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే పార్టీకి ప్రధాన బలమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందనే విషయాన్ని ప్రజలకు గర్వంగా చెప్పాలన్నారు. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులు, కార్యకర్తలకు స్పష్టం చేశారు