ప్రజలంతా తరలివచ్చి జయప్రదం చేయాలని చలువాది ప్రవీణ్ రావు పిలుపు
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వల్ల కాలుష్య కోరల్లో నరకయాతన అనుభవిస్తున్న బాధితుల పక్షాన, డంప్ యార్డ్ తరలింపును డిమాండ్ చేస్తూ మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మంగళవారం (అక్టోబర్ 27) ఉదయం 9 గంటలకు పాదయాత్రను ప్రారంభించనున్నారు.
ఈ పాదయాత్ర మొదటి రోజు ఎదులాబాద్‌లోని లక్ష్మీనారాయణ చెరువు వద్ద ప్రారంభమవుతుంది. ప్రారంభంలో ఎంపీ ఈటల రాజేందర్ లక్ష్మీనారాయణ చెరువును సందర్శించి, కాలుష్య బాధిత ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి మర్రిపల్లిగూడెం చేరుకుంటారు. అక్కడ గ్రామంలో పర్యటించి స్థానికులతో సమావేశమవుతారు.
భోజన విరామం అనంతరం పాదయాత్ర చందుపట్లగూడ, ఎన్‌ఎఫ్‌సీ నగర్, బొక్కని గూడెం, ఘనపురం మీదుగా అన్నోజిగూడ చేరుకుంటుంది. మొదటి రోజు మొత్తం 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుండగా, రాత్రికి అన్నోజిగూడలో ఎంపీ బస చేస్తారు.ఈ సందర్భంగా ఘట్కేసర్ మండల్ మాజీ అధ్యక్షులు, జిల్లా మీడియా కన్వీనర్ చలువాది ప్రవీణ్ రావు మాట్లాడుతూ,.. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ శాశ్వత తరలింపు కోసం మొత్తం 60 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుందని తెలిపారు. కాలుష్య సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. డంప్ యార్డ్ బాధితులు, ప్రజాసంఘాలు, నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.