ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండండి..
రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్, కిడారి శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి
అనంతగిరి, అక్టోబర్ 26,మేజర్ న్యూస్ :
ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ (జీసీసీ ) చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో గిరిజన గ్రామాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, వాగులు, వంకలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో వాగులు దాటే ప్రయత్నం చేయకూడదని, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఆశ్రయం పొందకూడదని తెలిపారు.
ప్రజలు ముందుగానే తాగునీరు, నిత్యావసర వస్తువులు, మందులు, టార్చ్‌లైట్లు వంటి అత్యవసర వస్తువులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, అధికారులు జారీ చేసే హెచ్చరికలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని, ప్రజలందరూ తమ కుటుంబ సభ్యుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కిడారి శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
ప్రజల ప్రాణరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.