ఎన్నికల నిబంధనల అమలుపై నిరంతర పర్యవేక్షణ..
విజయవాడ, మేజర్ న్యూస్ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనల మేరకు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల విధులను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలు తదితర విభాగాల పనితీరును ఆయన పరిశీలించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రకటనలు, ప్రసారాల పర్యవేక్షణతో పాటు సర్టిఫికేషన్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. వ్యయపరిశీలన అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు సరైన విధంగా నివేదికల రూపకల్పన, సమర్పణపై దృష్టిసారించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా సాగేలా సంబంధిత విభాగాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కార్యక్రమంలో డీఐపీఆర్‌వో కేవీ రమణరావు, డీపీఆర్‌వో టి.నాగేశ్వరరావు, డివిజనల్ పీఆర్‌వో కె.రవి, ఏవీఎస్ వీవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.