ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి..
విజయవాడ, మేజర్ న్యూస్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాన్ ఈ నెల 28న బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, తీవ్ర ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో సమావేశం అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు, ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని, పడవలు, పర్యాటక బోట్ల రాకపోకలు, ఆటవిడుపు పార్కులను నిలిపివేయాలని ఆదేశించారు. చెట్లు, శిథిల భవనాలు, తాత్కాలిక షెడ్ల కింద ఉండరాదని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ప్రవహించే కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. రైతులు కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. తుఫాన్ నేపథ్యంలో అక్టోబర్ 27, 28 తేదీల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. సెలవు రోజుల్లో పిల్లలను ఇళ్లలోనే ఉంచాలని, విహారయాత్రలకు పంపవద్దని సూచించారు. తుఫాన్‌పై సామాజిక మాధ్యమాల్లో వదంతులు, అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తుఫాన్ సమాచారం, సహాయక చర్యల కోసం కలెక్టరేట్‌లో 24 గంటల పాటు పనిచేసే నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, అత్యవసర సహాయం కోసం 91549 70454 నంబరును సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.