ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...!
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ప్రతిష్టాత్మక ఎస్వీయూలో రోజురోజుకూ విద్యార్థులపై ఫీజుల భారం పెరుగుతోందని ఎస్ఎఫ్ఐ, ఎన్ఎల్ఎస్ఏ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పీజీ పూర్తిచేసిన విద్యార్థులు బీఈడీ సీట్లు పొందినప్పటికీ పూర్తి ట్యూషన్ ఫీజు చెల్లిస్లేనే ప్రవేశాలు కల్పిస్తామని అధికారులు చెప్పడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎస్వీయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ కార్యాలయం ఎదుట వారు సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనివర్సిటీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అలాట్మెంట్ లో ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్న విద్యార్థుల నుంచి సైతం పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఫీజులు చెల్లించలేని కారణంగా అనేకమంది విద్యార్థులు అడ్మిషన్లు పొందకుండానే వెనుదిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం పీజీ, బీఈడీ వంటి రెండు కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందించేదని చెప్పారు. అనంతరం వర్సిటీ రెక్టార్ చెండ్రాయుడు నేరుగా విద్యార్థుల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ విషయంపై వీసీతో మాట్లాడి మంగళవారం ఉదయం 11 గంటలలోపు నిర్ణయం తీసుకుంటామని విద్యార్థులందరికీ అడ్మిషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, వినోద్, ఎన్ఎల్ఎస్ఏ వ్యవస్థాపకుడు సుందర్ రాజు, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు అనిత, నరసన్న, నాయకులు మహేష్ బాబు, తిప్పేస్వామి, చరణ్ తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్