అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్..
విజయవాడ, మేజర్ న్యూస్ : వ్యవసాయ రంగంలో డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేయడం, రైతులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లాలో అగ్రిస్టాక్ జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. దీనిద్వారా మంచి ఫలితాలు రావాలంటే సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఏవీఎస్‌రెడ్డి హాల్‌లో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన నూతనంగా ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ అధికారి సభ్య కార్యదర్శి/కన్వీనర్‌గా ఉంటారని, అదే విధంగా డీఆర్‌వో, డీపీవో, డీసీవో, డీహెచ్‌వో తదితరులు సభ్యులుగా ఉంటారని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేయడం, అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించడం, జిల్లాకు అనువైన వినూత్నమైన, ఆచరణ సాధ్యమైన డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలను గుర్తించడం ఈ టాస్క్‌ఫోర్స్ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. వివిధ శాఖల సమన్వయంతో అగ్రిస్టాక్ సమాచారాన్ని పూర్తిస్థాయిలో నమోదు చేయడం, అమలు పురోగతిని సమీక్షించడం, జిల్లాకు అనువైన వినూత్న కార్యక్రమాలను గుర్తించడం, వాటి అమలుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించడం వంటి అంశాలపై టాస్క్‌ఫోర్స్ దృష్టిసారిస్తుందన్నారు. గుర్తించిన అంశాలపై రూపొందించిన ప్రతిపాదనలను డ్యాష్‌బోర్డులో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని.. అందువల్ల త్వరతిగతిన సమాచారాన్ని అందించాలని సూచించారు. డిజిటల్ వ్యవసాయ సేవలను బలోపేతం చేసి, రైతులకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు వీలుకల్పించే కార్యాచరణపై దృష్టిసారించాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో జిల్లా బలాలు, గుర్తించిన సమస్యలు, సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు, వినూత్న యూజ్‌కేస్‌ల వినియోగం, పైలట్ ప్రాజెక్టులు తదితరాలపై దృష్టిసారించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. సమావేశంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా వ్యవసాయ అధికారి సీహెచ్ తిరుమలాదేవి, సీపీవో వై.శ్రీలత, మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.