ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
విజయవాడ, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు, మద్యం, బహుమతుల రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు (ఎస్‌ఎస్‌టీ) అప్రమత్తంగా, పకడ్బందీగా విధులు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా వ్యయ పరిశీలకుడు బి. విజయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం విజయవాడలోని పైపుల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ తనిఖీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది పనితీరును పరిశీలించారు. వాహన తనిఖీ రిజిస్టర్లు, స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి వాహనం వివరాలు, తనిఖీ సమయాన్ని రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని, తనిఖీల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా నిరంతరం చిత్రీకరణ చేపట్టాలని సూచించారు. అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా నగదు, మద్యం తరలిస్తున్నట్లు గుర్తిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాధారణ ప్రయాణికులు, అత్యవసర సేవల వాహనాలకు అనవసర ఇబ్బందులు కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేలకుపైగా నగదు లేదా విలువైన వస్తువులు తరలిస్తున్నట్లు గుర్తిస్తే స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంతవరకు ఎస్‌ఎస్‌టీ సిబ్బంది 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల్లో ధన, మద్య ప్రవాహాన్ని అరికట్టి స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని బి. విజయ్ కుమార్ సూచించారు. ఈ తనిఖీలో ఎస్‌ఎస్‌టీ బృంద సభ్యులు, స్థానిక పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.