ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన... - లయోలా కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ తనిఖీ
విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్ : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో రెండో సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల పరిశీలకులు, ఏపీ జెన్‌కో ఎండీ ఎస్. నాగలక్ష్మి, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఆంధ్ర లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్, ఓట్ల లెక్కింపు ప్రదేశం, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు, స్వీకరణ కేంద్రాలు, సిబ్బంది బస్సుల పార్కింగ్ ప్రాంతాలను మ్యాప్ ద్వారా పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, సిబ్బంది రాకపోకలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, ఏ. శ్రీధర్, చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.