ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు..
విజయవాడ, మేజర్ న్యూస్: ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్‌లోని అర్నబ్ తుపాను కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పరిస్థితిని సమీక్షించి సమన్వయ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 166 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 29, తిరువూరు డివిజన్‌లో 77, నందిగామ డివిజన్‌లో 44, విజయవాడ డివిజన్‌లో 16 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరిస్థితుల తీవ్రత, ప్రజల అవసరాలకు అనుగుణంగా అవసరమైతే మరిన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు తాగునీరు, ఆహారం, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు తదితర అవసరమైన వసతులతో సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల అవసరాలపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు సూచించారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ముందస్తు సమాచారం అందించడం, అప్రమత్తం చేయడం, అవసరమైన సహాయక చర్యలు చేపట్టడంలో అన్ని శాఖల అధికారులు నిమగ్నమయ్యారన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల నుంచి అందే సమాచారంపై తక్షణమే స్పందించేందుకు ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోండి: తుపాను ప్రభావంతో పెనుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. తుపాను సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అధికారులు సూచించినప్పుడు సమీపంలోని తుపాను పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు. నదులు, వాగులు, వంకల వైపు వెళ్లకూడదని, నీటి ప్రవాహాలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వదంతులను నమ్మవద్దని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక సమాచారాన్ని విశ్వసించకుండా, అధికారికంగా జారీ చేసే హెచ్చరికలు, సూచనలను మాత్రమే పాటించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.