సత్యనిష్ఠతోనే నిజమైన సమృద్ధి: మాజీ డీజీపీ రవి గుప్తా
దక్షిణ మధ్య రైల్వేలో ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం: మాజీ డీజీపీ రవి గుప్తా వెల్లడి!
సూర్య బ్యూరో, సికింద్రాబాద్: నిజాయితీ అనేది కేవలం ఆర్థిక అవినీతికి దూరంగా ఉండటం మాత్రమే కాదని, నైతికంగా విధులు నిర్వర్తిస్తూ దేశ ప్రగతికి ఉత్తమ సహకారాన్ని అందించడమే నిజమైన సత్యనిష్ఠ అని తెలంగాణ ప్రభుత్వ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్, డైరెక్టర్ జనరల్, విశ్రాంత ఐపీఎస్ అధికారి రవి గుప్తా స్పష్టం చేశారు. దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆధ్వర్యంలో అక్టోబర్ 26 నుండి నవంబర్ 1 వరకు నిర్వహించనున్న 'విజిలెన్స్ అవేర్నెస్ వీక్ - 2026' ప్రారంభోత్సవ కార్యక్రమం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ ఏడాది 'సత్యనిష్టతో సమృద్ధి' అనే ఇతివృత్తంతో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.
అనిమిష విజిలెన్స్ బులెటిన్ 59వ సంచిక విడుదల:
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవి గుప్తా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, సీనియర్ డిప్యూటీ జీఎం ఆశిష్ మెహ్రోత్రాలతో కలిసి 'అనిమిష' విజిలెన్స్ బులెటిన్ 59వ సంచికను ఆవిష్కరించారు. ఈ బులెటిన్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచారు. తొలుత రైల్వే అధికారులు, సిబ్బంది చేత జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సత్యనిష్ఠ ప్రతిజ్ఞ చేయించారు.
ఎక్కడ సత్యనిష్ఠ ఉంటే అక్కడే నిజమైన శ్రేయస్సు:
సభను ఉద్దేశించి రవి గుప్తా ప్రసంగిస్తూ, ఎక్కడ సత్యనిష్ఠ ఉంటుందో అక్కడ విశ్వాసం ఉంటుందని, ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందని, ఎక్కడ అభివృద్ధి ఉంటుందో అక్కడే నిజమైన శ్రేయస్సు సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. పర్యవేక్షణ లేని సమయంలో సైతం ఉద్యోగులు స్వీయ బాధ్యతతో సరైన పద్ధతిలో విధులు నిర్వర్తించినప్పుడే సంస్థల మనుగడ, అభివృద్ధి సాధ్యమవుతాయని పిలుపునిచ్చారు.
నివారణా నిఘాతోనే పారదర్శకత – జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ:
దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ నివారణా నిఘా ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. విజిలెన్స్ విభాగం ప్రాథమిక బాధ్యత కేవలం తప్పులను గుర్తించడం మాత్రమే కాదని, అవకతవకలను నివారించడం, అంతర్గత వ్యవస్థలను బలోపేతం చేయడం మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడమేనని స్పష్టం చేశారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు, భారీ సరుకు రవాణాతో ముడిపడి ఉన్న రైల్వే వ్యవస్థలో పారదర్శకతను కాపాడుతూ ప్రజా నమ్మకాన్ని నిలబెట్టడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ విలువలను పరిరక్షిస్తూ సిబ్బంది కర్తవ్య నిర్వహణ చేయాలని ఏజీఎం సత్య ప్రకాశ్ సూచించారు.
'తీస్రీ ఆంఖ్' నాటక ప్రదర్శన – విజేతలకు బహుమతుల ప్రదానం:
అవినీతి వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ రైల్వే సిబ్బంది ప్రదర్శించిన 'తీస్రీ ఆంఖ్' నాటిక సభికులను విశేషంగా ఆలోచింపజేసింది. ఈ సందర్భంగా చీఫ్ విజిలెన్స్ కమిషన్ (CVC) మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల, కళాశాలల విద్యార్థులకు, రైల్వే సిబ్బందికి నిర్వహించిన వ్యాసరచన, పోస్టర్ చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ (PHODs), సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్లు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.