ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి: ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.సంగారెడ్డి జిల్లా టీఎన్జీవో నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ అలీ తన కార్యవర్గ సభ్యులను మంత్రికి పరిచయం చేశారు. అసోసియేట్ అధ్యక్షులు పి. వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, కోశాధికారి కసిని శ్రీకాంత్, మహిళా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి తదితరులను మంత్రి పరిచయం చేసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. ఉద్యోగులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేలా కృషి చేయాలని సూచించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.నూతనంగా ఎన్నికైన టీఎన్జీవో కార్యవర్గం ఉద్యోగులతో సమన్వయం పెంపొందించుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. ఉద్యోగులందరూ ఐక్యంగా పనిచేసి సంగారెడ్డి జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో పట్టణ శాఖ అధ్యక్షుడు యాదవ రెడ్డి, కార్యదర్శి వెంకట్, కార్యవర్గ సభ్యులు వెంకటేశం, నాగేశ్వరరావు, రామప్ప, కిరణ్, గౌస్ హాస్మి, నవాజ్, రమేష్, మోహనప్ప, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు షరీఫ్‌తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.