పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పరిగిలో క్యాండిల్ ర్యాలీ –పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
పరిగి,మేజర్ న్యూస్: పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాల్లో భాగంగా మంగళ వారం పరిగిలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ పాల్గొని పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. పరిగి బస్టాండ్ నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ మాట్లాడుతూ... పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి సేవలు ప్రతి పోలీస్ అధికారి, సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలకు సమాజం అండగా నిలవాలని అన్నారు. యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. పోలీస్ అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిరంతరం సేవలందించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అమర వీరుల ఫ్లెక్సీకి జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ , ఇతర పోలీస్ అధికారులు, విద్యార్థులు నివాళులర్పించి, దేశం కోసం, ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ సిబ్బంది అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, డీటీసీ డీఎస్పీ శ్రీనివాసులు , పరిగి కొండల్ రెడ్డి సీఐ, కొడంగల్ సిఐ చంద్ర శేఖర్ రెడ్డి , ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.