కాకినాడ దిశగా పయనం..యానాం వద్ద తీరం దాటే అవకాశం.. 150 కి.మీ. వేగంతో భీకర గాలులు..తీరప్రాంతాల్లో భారీ వర్షాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీరం వైపు అతి తీవ్ర తుఫాన్ ‘అర్నబ్’ వేగంగా దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ (IMD) అందించిన తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ తుఫాను గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, విశాఖపట్నానికి 170 కి.మీ., కాకినాడకు 90 కి.మీ., బాపట్లకు 240 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది.
తుఫాను యొక్క బాహ్య వలయం ఇప్పటికే భూభాగాన్ని తాకడంతో కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ అర్నబ్ తుఫాన్ యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఇది తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నారు.
తీరం దాటే సమయంలో సముద్రంలో తీవ్ర అలజడి నెలకొని, గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా ఇవి 150 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావంతో రేపు ఉమ్మడి విశాఖ, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరుతో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయం అత్యంత కీలకమైనందున ప్రజలంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు మరియు చెట్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.