మైల్వార్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం.. అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలి: కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు విష్ణువర్ధన్ డిమాండ్
బషీరాబాద్, మేజర్ న్యూస్: బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు విష్ణువర్ధన్ ఆరోపించారు. సర్వే నంబర్ 235, ఇంటి నంబర్ 3-47 పరిధిలోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గ్రామానికి చెందిన కె. సురేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతంలో వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) విచారణ చేపట్టారని విష్ణువర్ధన్ తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 132 ప్రకారం, అవసరమైతే పోలీసుల సహకారంతో అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శికి డీపీఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తికి నోటీసులు ఇచ్చినప్పటికీ నిర్మాణాలు ఆగలేదని ఆరోపించారు.ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వ భూముల ఆక్రమణలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోలీసుల సహకారంతో అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కురువ తమన్న, వార్డు సభ్యులు బలరాం, నరేష్, ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ ఖలీల్, సత్తార్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: కాశీం పాషా, బషీరాబాద్, వికారాబాద్ జిల్లా.