BREAKING
కోనసీమ–కాకినాడ వైపు దూసుకొస్తున్న ‘ఆర్నబ్’.. ల్యాండ్‌ఫాల్‌కు ముందు కీలక గంటలు ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌ : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎన్నికల వ్యయ పర్యవేక్షణలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలి జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు చుట్టుముట్టిన అతి భారీ వర్షాలు ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా 166 పునరావాస కేంద్రాలు.. ఓట్ బచావో–దేశ్ బచావో ర్యాలీని విజయవంతం చేయండి వైసిపి ప్రచారంలో దూసుకుపోతున్న చైర్మన్ అభ్యర్థి శ్రీలక్ష్మి రాజేష్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి క్యాండిల్ ర్యాలీతో పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళులు టిప్పర్ వాహనాల బ్యాటరీ దొంగ అరెస్ట్-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్ పవర్‌పేట సినిమాలో పడమటవీధి జానకిగా రితికా నాయక్.. పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే లుక్ విడుదల ఆదర్శ కుటుంబం వేదికపై వెంకీ మామ రీల్ కొడుకు ఎమోషనల్ స్పీచ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. ఐదు రోజుల్లో పాతిక కోట్ల వసూళ్లు దాటిన ఉడ్తా తీర్ నా జీవితంలో ఎదుర్కొన్న కష్టాల్లో కేవలం పది శాతమే సినిమాలో చూపించారు.. బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ సంచలన వ్యాఖ్యలు

తుపాను ముప్పు.. విశాఖలో హైఅలర్ట్!

Select Suryaa Now
తుపాను ముప్పు.. విశాఖలో హైఅలర్ట్!

37 ప్రాంతాల్లో 10,176 కుటుంబాలకు ముప్పు అంచనా

54 పునరావాస కేంద్రాలు.. 31,405 మందికి ఆశ్రయం కల్పించేలా ఏర్పాట్లు

1,914 ఇళ్లకు ముంపు, నష్టం వాటిల్లే అవకాశం

7,122 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు ముప్పు

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు

11 మండలాలకు ప్రత్యేక అధికారులు.. నిరంతర పర్యవేక్షణ

మేజర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: విశాఖపట్నం, అక్టోబర్ 26: తుపాను ముప్పు నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల ప్రభావం ఎదురయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలను ముమ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లోని 37 గ్రామాలు, ప్రాంతాల్లో 10,176 కుటుంబాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు అధికార యంత్రాంగం అంచనా వేసింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 54 పునరావాస కేంద్రాలను గుర్తించింది. వీటిలో 31,405 మందికి ఆశ్రయం కల్పించే సామర్థ్యం ఉన్నట్లు జిల్లా యంత్రాంగం సోమవారం రాత్రి 8 గంటలకు విడుదల చేసిన తుపాను సన్నద్ధత నివేదికలో వెల్లడించింది. జిల్లాలోని 66 కిలోమీటర్ల తీరప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు. భీమునిపట్నం మండలంలో అత్యధికంగా 4,120 కుటుంబాలు, గోపాలపట్నంలో 2,080, గాజువాకలో 1,438, సీతమ్మధారలో 900, విశాఖ రూరల్‌లో 672 కుటుంబాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన మండలాల్లోనూ ముంపు ప్రాంతాలను గుర్తించి అవసరమైన సహాయక చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

1,914 ఇళ్లకు ముప్పు!

తుపాను ప్రభావంతో జిల్లాలో ఆరు మండలాలు లేదా మున్సిపల్ ప్రాంతాల పరిధిలోని 11 కాలనీలు, లేఅవుట్లలో 1,914 ఇళ్లు ముంపునకు గురికావడం లేదా దెబ్బతినే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం నాలుగు మండలాల్లోని 40 గ్రామాల్లో 2,048 హెక్టార్ల పంటలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. దీంతో 3,466 మంది రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఉద్యాన శాఖ పరిధిలో 85 గ్రామాల్లో 5,074 హెక్టార్ల పంటలకు ముప్పు పొంచి ఉంది. పంట నష్టాన్ని తగ్గించేందుకు సంబంధిత శాఖలను అప్రమత్తం చేశారు.

సహాయక చర్యలకు ప్రత్యేక బృందాలు

అత్యవసర సహాయక చర్యల కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విశాఖ పరిధిలో అందుబాటులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 285 మంది ఈతగాళ్లు, 25 ప్రైవేటు పడవలను గుర్తించారు. అగ్నిమాపక శాఖ ఆరు చెట్ల తొలగింపు బృందాలు, రెండు పడవల సహాయక బృందాలను సిద్ధం చేసింది. 269 లైఫ్ బాయ్‌లు, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 24 గంటల తుపాను నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు రెండు మొబైల్ బృందాలను సిద్ధంగా ఉంచారు.

గర్భిణులు, చిన్నారులపై ప్రత్యేక దృష్టి

తుపాను నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర వైద్య సేవలకు ఏర్పాట్లు చేస్తోంది. ఆసుపత్రుల్లో 267 మంది గర్భిణులకు సంబంధించిన ఏర్పాట్లను నివేదికలో పేర్కొన్నారు. జిల్లాలో నమోదైన 8,911 మంది గర్భిణులు, 7,929 మంది బాలింతలు, 61,893 మంది చిన్నారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టనున్నారు. అత్యవసర మందులు, అంబులెన్సులు, వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

రహదారులు, విద్యుత్ వ్యవస్థపై నిఘా

భీమునిపట్నం, పద్మనాభం ప్రాంతాల్లో రెండు బలహీనమైన వంతెనలు లేదా కల్వర్టులను గుర్తించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 50 కిలోమీటర్ల మేర రహదారులు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది, పరికరాలను సిద్ధం చేస్తోంది. నీటి నిల్వలు ఏర్పడే ప్రాంతాల్లో మోటార్లు, భారీ యంత్రాలను వినియోగించేందుకు జీవీఎంసీ చర్యలు చేపట్టింది. అత్యవసర తాగునీటి సరఫరా కోసం 16 ట్యాంకర్లను గుర్తించారు.

24 గంటలూ కంట్రోల్ రూమ్‌లు

జిల్లాలోని 11 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. కలెక్టరేట్, జీవీఎంసీ, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలతో పాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో నియంత్రణ కేంద్రాలను అందుబాటులో ఉంచారు. మత్స్యకారులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0891-2590100, 0891-2590102, జీవీఎంసీ టోల్ ఫ్రీ నంబర్ 1800 4250 0009 లేదా వాట్సాప్ నంబర్ 9014218870ను సంప్రదించాలని అధికారులు సూచించారు.