ఎన్నికల విధులపై సిబ్బందికి అవగాహన సదస్సు.. రిటర్నింగ్ అధికారి ఎం. రాజా రమేష్ ప్రేమ్ కుమార్
అనపర్తి మేజర్ న్యూస్. త్వరలో జరగనున్న మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం. రాజా రమేష్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలపై ఆయన సమీక్షించారు. ఎన్నికల విధివిధానాలపై సిబ్బందికి అవగాహన కల్పిస్తూ, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో సమన్వయం, క్రమశిక్షణ, సమయపాలనకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం. రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ డి.వి.ఎన్. అనిల్ కుమార్‌తో పాటు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.