తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పలాస నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
మూడు రోజులపాటు సరిపడా నిత్యావసర వస్తువులను సిద్ధం చేసుకోవాలి.
మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.
పలాస,అక్టోబర్ 26, మేజర్ న్యూస్.
పలాస నియోజకవర్గ ప్రజలందరూ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా సోమవారం ఆయన మాట్లాడుతూ..రాబోయే రెండు రోజుల్లో తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ముఖ్యంగా ఉద్దానం ప్రాంత రైతులు, తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.తుఫాన్ కారణంగా భారీ వర్షాలు, ఈదురుగాలులు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. కనీసం మూడు రోజులపాటు సరిపడా ఆహార పదార్థాలు, తాగునీరు, ఇతర నిత్యావసర వస్తువులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు, అదనపు బ్యాటరీలు, పవర్ బ్యాంకులు సిద్ధంగా ఉంచుకోవాలని, ఇన్వర్టర్లు, జనరేటర్లు అందుబాటులో ఉన్నవారు వాటిని ముందుగానే తనిఖీ చేసుకోవాలని తెలిపారు.ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలోని కొబ్బరి, జీడి రైతులు తమ పంటలు, వ్యవసాయ ఉత్పత్తుల రక్షణకు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లే విషయంలో అధికారిక హెచ్చరికలు, ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని, తీర ప్రాంత ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.ప్రజలకు ఏవైనా అత్యవసర అవసరాలు ఎదురైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటారని డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. ప్రజలు అవసరమైన సహాయం కోసం స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అధికార యంత్రాంగం జారీ చేసే సూచనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.