ఎన్నికల విధుల్లో మినహాయింపు ఇవ్వండి..
- జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన యూటీఎఫ్ ప్రతినిధులు..
శ్రీకాకుళం అక్టోబర్ 26 మేజర్ న్యూస్ : త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి 60 సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయులతో పాటు బాలింతలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మహిళా ఉపాధ్యాయులకు వారి సొంత మండలంలో లేదా సమీప మండలంలోనే ఎన్నికల విధులు కేటాయించాలని, వారిని ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ (ఏపీఓ) బాధ్యతల నుంచి మినహాయించాలని కోరారు.
ఈ విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పిస్తామని, మహిళా ఉపాధ్యాయులకు స్థానికంగా లేదా పక్క మండలాల్లో విధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వీలైనంతవరకు న్యాయం చేస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చినట్లు వెల్లడించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సీసీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లండ బాబురావు, ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామమూర్తి, జిల్లా కార్యదర్శులు బి. రవికుమార్, జి. సురేష్, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్. నారాయణరావు, ఎల్. కోదండ రామయ్య, శ్రీరామచంద్రమూర్తి, ఐ. రామారావు తదితరులు పాల్గొన్నారు.