నేడు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్.. నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: జిల్లా వ్యాప్తంగా నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు నాలుగు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాలు జరగనున్నాయి.వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించనున్నారు. పరిగి పట్టణంలోని శారద గార్డెన్-1లో మాజీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి పట్టణం లక్ష్మీ నరసింహ గార్డెన్‌లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించనున్నారు. తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీశైలం రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరుకానున్నారు.నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాలకు పార్టీ నాయకులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఇప్పటికే ఏర్పాట్లు చేపట్టారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహణకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.